Wednesday 12 April 2023




Meditation from Mountains : The Scorching Sun - A Handbook to Haiku

~
Scorching sun
Dead tree
Mad crow
1
సూర్యడు నడినెత్తిన తీక్ష్ణతతో మండుతున్నాడు. గాలి దిశ మారింది. సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో, ఆ పర్వతాలలో అప్పటి వరకూ వీచిన చల్లని గాలులు హఠాత్తుగా వేసంగి గాడ్పులుగా రూపాంతరం చెందాయి. అరణ్యాల దిశ నుండి వచ్చే గాలులు ముగిశాయి. ఇప్పుడు పట్టణాల దిశ నుండి వచ్చిన మైదాన ప్రాంతాల గాలులు ఆ పర్వతాల్ని ముంచెత్తాయి. ఆ ప్రాంతం హఠాత్తుగా ఉగ్రమైన ఉష్ణంతో నిండిపోయింది. హఠాత్తుగా వాతావరణం మారిపోయిందో లేదా నేను గమనించలేకపోయానో చెప్పలేను!! అటువంటి చోట దేహస్పృహ ఉండదు. కాలం స్తంభిస్తుంది. కాలాతీతమైన దాని స్పర్శ ఒక అనుగ్రహంగా ప్రాప్తిస్తుంది.
అప్పటికే నేను మూడు గంటలకుపైగా ఒంటరిగా కాలినడకన నిట్రమైన ఇరుకు లోయల్లో తిరుగుతున్నాను. తిరుగుముఖంపట్టి, వచ్చే దారిలో ఒక కొండ పైకి అతి కష్టం మీద ఎక్కాక, ఇక సత్తువ చాలక, చాలీచాలని ఒక ఎండిన చెట్టు నీడలో కూలబడ్డాను. నిజానికి ఆ నీడే ఎండ కంటే వేడిగా అనిపించింది. దాహానికి పెదవులు ఎండిపోయాయి. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. డస్సిపోయిన ప్రాణం అపస్మారకాన్ని కోరుతోంది.
కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాను. దుఃఖం కాదుగానీ దేహం, మనసు నొప్పిగా ఉన్నాయి. అప్పుడే వినిపించింది, ఒక కాకి అరిచే శబ్దం. దాని కూతలో నొప్పి ఉంది. అది నా ఊహ కాదు. మీరు పక్షుల, ఉడతల, కోతుల అరుపుల్లో నొప్పిని ఎప్పుడైనా గుర్తు పట్టారా? కళ్ళు తెరచి చూస్తే ఈ ఫోటోలోని దృశ్యం కనిపించింది. అప్పుడే glimpse లా ఒక అనుభవం కలిగింది. అది ఒక emotional experience కాదు. Reflection కూడా కాదు.
Scorching sun
Dead tree
Mad crow
మనకి జీవితంలో సంభవించే దర్శనాలు అన్నీ సకారాత్మకం కానక్కరలేదు. నకారాత్మకం కూడా కావచ్చు. నిజానికి ఆ దర్శనాలు ఈ విభజనకు అతీతం. అయినప్పటికీ నశ్వరమైన, బుద్భుదమైన మానవజీవితం వాటిని విభజించి చూడక మానదు.
ఆ సమయంలో అక్కడ నేను ఈ హైకూని రాయలేదు. ప్రాచీన ఋషులు కూడా అలా రాసి ఉండరు. అనుభవంలో పదాలు ఉండవు. అనుభవం ముగిశాకనే పదాలు వ్యుత్పత్తి జరుగుతుంది. ముగిసిన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని రాయాలని ప్రయత్నిస్తాడు కవి. కాని అతడు రాసినది ఆ అనుభవం కాదు. Words destroy everything beautiful and intense.
ఇస్మాయిల్ గారు నాకు ఒక గొప్ప రహస్యం చెప్పారు. అది అప్పుడే నా మనసులో శాశ్వతంగా నాటుకుపోయింది. అది మీతో ఈ రోజు పంచుకుంటాను. "వంద వాక్యాలతో కూడా చెప్పడం సాధ్యం కాని దానిని ఒకే వాక్యంతో చెప్పు. వంద పదాలలో కూడా చెప్పడం సాధ్యం కాని దానిని ఒకే పదంలో చెప్పు." These are golden words not only for the haiku, for the poety and life too. నీవు ఎక్కువ మాటలను ఉపయోగించే కొలదీ నీ లోతును కోల్పోతావు. నీవు చెప్పాలనుకున్న దానికి దూరమవుతావు. దారి తప్పిపోతావు.
ధ్యానాత్మకం కానిది హైకూ కాదు. ప్రకృతి, జీవితాలకు దూరమైంది హైకూ కాదు. హైకూ ప్రక్రియ ద్వారా కవి తనకి ప్రాప్తించిన దర్శనాన్ని recreate చేయగలడా? కొంత వరకూ. అది నిజం, అభద్ధం కూడా. ఎందుకంటే హైకూ అతి తక్కువ పదాలని ఉపయోగిస్తుంది. కాబట్టి అది unknown కి దగ్గర. మౌనానికి దగ్గర. మౌనం మాత్రమే వాస్తవమైన, శక్తివంతమైన communication tool. మౌనం తరువాత అతి శక్తివంతమైన సాధనం హైకూయే అంటాను. కాలాతీతానికి, కాలానికి నడుమ వంతెన హైకూ. నిజానికి హైకూ recreate చెయ్యదు. మీ స్వంత అనుభవానికి ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నిస్తుంది.
కవి అనుభవం, కవి హైకూలో వ్యక్తం చేసిన అనుభవం, పాఠకుడి అనుభవం పూర్తిగా భిన్నం. అయినా ఎంతో కొంత అక్కడ అనుభవం సాధ్యం. ఒక intensity, not emotion, సాధ్యం. అయితే పాఠకుడు తన intellect ని, skills ని పూర్తిగా విడిచిపెట్టాలి. Surrender కావాలి. వర్షాకాలంలో దున్నిన భూమిలా, fertile గా, ఏ విత్తనాన్ని అయినా స్వీకరించడానికి సిద్ధంగా, కేవలం సాక్షీభూతంగా, ఉదాసీనంగా ఉండగలగాలి. అప్పుడే అనుభవం సాధ్యం.
కవిత్వానికి, హైకూ కి తేడా ఏమిటంటే కవిత్వం వెనుక ఊహ ఉంటుంది. హైకూ వెనుక దర్శనం ఉంటుంది. ఋషుల అనుభవాల నుండి మాత్రమే గొప్ప హైకూలు వచ్చాయి. వారిలా జీవించకుండా, ప్రకృతితో ప్రగాఢమైన connection లేకుండా, ప్రకృతిలో ఏకాంతంగా గడపకుండా హైకూ రాయడం అసాధ్యం. నా దృష్టిలో హైకూని కవిత్వం స్థాయికి తీసుకురావడం, సాహిత్య స్థాయిలో approch అవ్వడం నేరం. ముగ్గిన పండు సహజంగా నేలకు రాలుతుంది.
ప్రగాఢమైన జీవితానుభవాల ఊతం లేకుండా హైకూ కోసం ప్రయత్నించకండి. అది ప్రయత్నంతో పట్టుబడేది కాదు.
హైకూ మీద 20, 30 ఏళ్ళు విచారణ చెయ్యండి. నిరంతర చింతనలో జీవించండి. హైకూ ఒక నాటికి అవగతం అవుతుంది. Sanctity లేకుండా హైకూ సాధ్యం కాదు. హైకూ ప్రయత్నంతో సాధించే ప్రక్రియ కాదు.
2
5-7-5 rule తప్పని సరి కాదు. అలాగే ఇతర rules కూడా. కాని హైకూ ప్రక్రియకు హైకూ యొక్క స్వాభావిక ధర్మాన్ని కలిగి ఉండడం మాత్రం తప్పని సరి. అది ఒక క్షణ మాత్రపు సత్య దర్శనాన్ని ఆవిష్కృతం చెయ్యాలి. ప్రకృతికి సంబంధించిన ధ్యానాత్మక అనుభవాన్ని మాత్రమే కాదు, జీవితంలో మెరుపులా తటస్థించంచే ప్రగాఢమైన సత్య దర్శనాల్ని మీరు అన్ని రకాల నిబంధనలకు అతీతంగా హైకూగా రాయవచ్చు. అది ధ్యాన ప్రక్రియే తప్ప కవిత్వ ప్రక్రియ కాదు అని గ్రహించడం చాలా అవసరం. హైకూ ని meterial and mundane notions లోకి తీసుకురావడం ఆ ప్రక్రియను అవమానించడమే అవుతుంది.
హైకూని యథార్థముగా అవగతం చేసుకున్న వారు చాలా తక్కువ. మిగతా కవిత్వ ప్రక్రియల్లా శిక్షణతో, అనుభవంతో, ప్రయత్నంతో పట్టుబడేది కాదు. ముందు విస్తృతంగా అధ్యయనం చెయ్యండి, తరువాత లోతుగా యోచన చెయ్యండి. ముందుగా రూల్స్ పాటించడానికి ప్రయత్నించండి. తరువాత వాటిని విడిచి పెట్టండి. హైకూ గురించి ఎవరు ఏమి చెప్పినా అది అసమగ్రమే. అది హృదయంలో దానికది అవగతం అవుతుంది. స్వీయజ్ఞానాన్ని అనుసరించండి. అలా ఒకనాటికి మీరు గొప్ప హైకూలు రాయగలుగుతారు.
నిజమైన హైకూలు అరుదు. వేలలో ఒకటో రెండో తారసపడతాయి.
గత వంద సంవత్సరాలుగా హైకూ dilute అవుతూవచ్చి, కొత్త వారికి హైకూ యొక్క నిజమైన స్వాభావికత అందకుండా పోతోంది. లోలోతుల్లోకి తగినంతగా పాదుకోకుండా, నిశ్చలతలో ప్రగాఢంగా స్థితం కాకుండా హైకూను ఎవరైనా ఎలా రాస్తారు?
హైకూలో ప్రయోగాలకు నేను వ్యతిరేఖం కాదు. రాసేది హైకూ కాకుండాపోయే ధోరణులకు నేను వ్యతిరేఖం.
ఛాయాచిత్రం, వ్యాసం, హైకూ : శ్రీరామ్

Monday 19 December 2022

 

అవతార్ 2 - ఒక ధ్యానానుభవం

జేమ్స్ కెమెరాన్, టెరెన్స్ మాలిక్ లాగా గొప్ప తాత్వికుడు కాదు, జాంగ్ ఇమో లాగా గొప్ప టెక్నీషియన్ కాదు, పీటర్ జాక్సన్ లాగా సహజ కళాకారుడూ కాదు. గతంలో కాస్త నాణ్యత గల మాస్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ చిత్రాలు తీసిన దర్శకుడు మాత్రమే. గొప్ప సామర్థ్యాలు పుట్టుకతో వరంగా లభించని ఓమాదిరి దర్శకుడు మాత్రమే. అయితే అతడు మాస్టర్ గా ఎలా ఎదిగాడు?

 

 టెరన్స్ మాలిక్ వలె కెమెరాన్ 20 ఏళ్ళు అరణ్యాలలోకి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఏకాంతంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేదు. మరి అతడిలో spiritual inclination ఎందుకు, ఎలా కలిగిందో చెప్పడం కష్టం. బహుశా అతడిలోని తీవ్రమైన జిజ్ఞాస, అంకితభావం, ప్రకృతి పట్ల అతనికి ఉన్న ప్రేమ అతడిలోని పరిణతకు కారణం కావచ్చు. టైటానిక్ తర్వాత, ఇంకా చెప్పాలంటే అవతార్-1 లో, అతని కళలో కనిపించిన గొప్ప spiritual quality ని గమనించి ఆశ్చర్యపోయాను. ఒక జీవితంలో ఇంత గొప్ప ఎదుగుదల ఎలా సాధ్యం అనే ఆశ్చర్యం కలిగింది.

 

అవతార్-2 లో ధ్యానాత్మకమైన visuals లో, ఆ దృశ్యధారలో టెరెన్స్ మాలిక్ ముద్రను మనం చూస్తాం. జేమ్స్ కెమెరానే కాదు ఆధునిక దర్శకులలో masters ఎవరూ టెరెన్స్ మాలిక్ ప్రభావం నుండి తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే మాలిక్ గురువు. జ్ఞాని. అందరికీ.

 

అవతార్-2 సాధారణమైన కథే కావచ్చు. కానీ సాధారణమైన అనుభవం మాత్రం కాదు. సౌందర్య శక్తిని, ప్రకృతితో మనకున్న deep connection ని, spiritual connection ని లోతుగా అనుభవించేటట్టుగా, pristine and lucid visual తో, అవి visuals కాదు, మనం ఒక ఒక చేపలాగానో లేదా ఒక తిమింగలంలాగోనో ఒక జన్మని జీవించడం. సరిగ్గా ఒక కొత్త, మహత్తర లోకంలో జన్మని ఎత్తి ఒక జీవితాన్ని జీవించిన గొప్ప అనుభవాన్ని ఇస్తుంది ఈ చిత్రం.

 

మేధస్సును ఉపయోగించకుండా సౌందర్యానికి, అనుభూతికి  వశ్యులైతే చాలు. అదే అర్హత. అది ఒక్కటే. మీకు పండోరా లోకపు దివ్య కాంతి అనుభూతమవుతుంది. సున్నితమైన అతిలోక వర్ణాలు మీలోకి ఇంకిపోతాయి. నిజానికి కేమెరాన్ దృష్టిలో పండోరా అంటే సరిగ్గా మనం జీవిస్తున్న, నాశనం చేసుకుంటున్న మన భూమే. పండోరా అంటే ఈ భూమిని ఎంత అందంగా, ఎంత పవిత్రంగా, ఎంత సున్నితంగా మనం చూడాలో, ఈ భూమిపైన ప్రతి జీవరాశితోను మనం ఎటువంటి ప్రేమాస్పదమైన సంబంధాన్ని కలిగివుండాలో,  అలాగే ఏ జీవి మనకు భిన్నమైనది కాదనీ- ఈ లోకం, ఈ లోకంలోని సర్వజీవులూ, నువ్వూ-నేనూ ఒకటేననీ, వేరు కాదనీ - ఒక బలమైన, స్థిరమైన, శక్తివంతమైన అనుభవంగా మన హృదయాల్లో ఒక దర్శనంగా ఆవిష్కృతం కావడం. 

పండోరా ఒక ఆదర్శ లోకపు నమూనా కాదు. మనం జారవిడుచుకున్న సత్యం.  

ఈ చిత్రాన్ని ఒక కథగా చూసే వాళ్లకు కథ మాత్రమే కనిపిస్తుంది. విమర్శనాత్మక కోణంలో చూసేవాళ్లకు లోపాలు కనిపించవచ్చు. ఒక అనుభవంగా చూసే వాళ్లకు ఇది ఒక కాలాతీతమైన సత్యం. ఆది, అంతం లేని ప్రకృతిలో మనం ఉనికి లేకుండా కరిగిపోవడం. ఒక అమలిన ఆధ్యాత్మిక అనుభవం.

 ఇంకా ఎంతో ఉదాత్తమైన కథలో ఈ చిత్రాన్ని తీసివుండొచ్చు. తీస్తే ప్రజలు చూస్తారా అనేదే సందేహం.  అత్యంత భారీ చిత్రం కాబట్టి వ్యాపార విలువలు అనివార్యం. అక్కడికీ సున్నితమైన సన్నివేశాలకు కోత పడకుండా కాపాడుకోవడం కోసం స్టూడియోలతో కేమెరాన్ పోరాడవలసివచ్చింది.

కెమెరూన్ అవతార్ ని ఎంచుకున్నదే ప్రకృతిని కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని, ఇప్పటికే సమయం మించి పోయింది అనే విషయాన్ని బలంగా ప్రజల హృదయాల్లోకి చొప్పించాలని నిర్ణయించుకోవడం వల్లనే జరిగింది. అందువల్లనే అతను వేరే ప్రాజెక్టుల్ని పక్కనపెట్టి అవతార్ ని వీలైనన్ని ఎక్కువ భాగాలుగా తీయాలని తపిస్తున్నాడు. గొప్ప శక్తి, గొప్ప బాధ్యతను ఇస్తుంది. అత్యంత శక్తివంతమైన, ప్రభావంతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టే తన ఉనికి కారణమైన ప్రకృతిని కాపాడుకోవాలని నిబద్ధతతో ప్రయత్నిస్తున్నాడు. చాలా మంది అనుకుంటున్నట్టు అవతార్ franchise ని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం కెమెరాన్ కి లేదు.   

 మనిషి యొక్క మూలాల్ని అనితర సాధ్యమైన సాంకేతికతతో అనుభవైకవేద్యం చేస్తున్నాడు. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు కాబట్టే సందేశం బలంగా ప్రజలకు అందే వీలు ఉంటుంది. ఇప్పుడున్న అపసవ్యమైన లోకరీతులకి అద్దం పట్టడమే కాకుండా పరిష్కారాల్ని చూపుతుంది ఈ చిత్రం. ప్రపంచాన్ని వినాశనం చేసున్న పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్ఞవాదం, వలసవాదం, ఆక్రమణవాదం, వ్యాపార సంస్కృతి వంటి ఆధునిక చీకటి విలువలకు వ్యతిరేకంగా ఒక కళాకారుడు పూరించిన సమర శంఖం ‘అవతార్’. కార్పోరేట్ శక్తులు అవతార్ ని బహిరంగంగానే  విమర్శించాయి. గర్హించాయి. ఈ చిత్ర విజయాన్ని చూసి నొచ్చుకున్నాయి. బలవంతుల దోపిడీకి గురయ్యో ప్రతి వ్యక్తి హృదయానికి అవతార్ చేరువలో ఉంటుంది. తన ఇంటిని, నేలను, ఉనికిని కోల్పోతున్న ప్రతి వ్యక్తికి అవతార్ అర్థమవుతుంది.              

 మేధోపరమైన చర్చలకు ఆస్కారం లేకుండా సూటిగా, సరళంగా అందరికీ - ఇక్కడ అందరికీ అంటున్నానంటే నిజంగానే ఈ భూమిపై జీవించే అందరికీ - అర్థ మయ్యేంత సరళ మైన భాషలో కెమెరాన్ సందేశం అందించగలిగాడు. అవతార్ ని న్యూయార్క్ నుండి విశాఖ అడవుల్లోని మారుమూల గూడెం గిరిజనుల వరకూ ప్రతి ఒక్కరూ చూస్తారు. ప్రేమిస్తారు. ఎందుకు? వారికి ఏదో అర్థమవుతుంది, అందాల్సింది అందుతుంది, రహస్య సందేశం.  


Monday 5 December 2022

 మరపు


నువ్వు నా నుండి 

దూరమైనప్పుడల్లా 

నేను చెయ్యగలిగింది 

ఏముంది

ఇంకొంచెం నీకు

దూరమవడం తప్ప


నేను దూరమైనప్పుడల్లా 

నువ్వు ఎలాగూ ఇంకొంత

దూరమవుతావు

నేను దగ్గరవ్వాలనుకున్నప్పుడల్లా

మరింత దగ్గరతనాన్ని కోల్పోతావు


అందుచేతనే 

నేను దగ్గరవడం కంటే 

దూరమవడం కోసం 

ప్రయత్నించడంలోనే 

నీకు ఎక్కువ దగ్గరవుతున్నట్టు

అనుభూతి చెందుతారు 


చివరికి 

మనం 

ఒకరికొకరం

ఎంతగా దూరమైపోతామంటే

ఒకప్పుడు 

మనం కలిసి ఉన్నామన్న 

విషయమే 

మర్చిపోయేంతగా


కాని ఆ మరపు 

వరంగా

మనలో 

ఒక్కరికే లభిస్తుంది 


కవిత, చిత్రం: శ్రీరామ్


Sunday 4 December 2022


 Curse of Mundane

మహాసముద్రపు అమేయమగు
శక్తి ముందు
శిరస్సు వంచి ప్రణమిళ్ళని
నక్షత్రఖచిత ఆకాశం కింద
అశాంతి నిండిన మనసుని
పరచి సేదతీరని
వృక్షాల ప్రేమను స్వీకరించి
చేతన సాంతం
నింపుకోని
పర్వతాల అలౌకిక గాంభీర్యానికి
వశపడని
మబ్బులని
వెన్నెలని
పక్షుల కిలకిలారావాలని
అనుభూతి చెందని
పసిపిల్లల ప్రేమాస్పదమైన
వదనాల్ని
చూసి సాంత్వన పొందని
ఈ లోకపు ప్రతి అద్భుతానికి
విస్మయం చెందని
ప్రతి దినాన్ని
శపించు
నా జీవితం నుండి నిషేదించు
మేకులు కొట్టబడిన
శవ పేటికలోని
పురుగుల లుకలుకవలె సాగే
సాదాసీదా
రోజువారీ సంక్షుభిత జీవితంతో
సంతృప్తి చెంది
జీవితపు ప్రతి క్షణాన్ని
నిబిడాశ్చర్యంతో
వీక్షించలేని
స్వీకరించలేని
అంధజీవితంలోని
మామూలుతనం
నుండి
బయట పడే
దైర్యాన్ని, తెగువని, సంకల్పాన్ని
నాకివ్వు
కవిత, ఛాయాచిత్రం : శ్రీరామ్
Shanthi Ishaan, Naagini Kandala and 21 others
5 comments
Like
Comment
Share


సాహసనారి లేడీ గలాద్రియెల్


ప్రపంచవ్యాప్తంగా Galadriel పాత్ర పట్ల Trolls విరుచుకుపడుతున్నారు. Trolls దాడిని తట్టుకోలేక అమెజాన్ ప్రైమ్ వీడియో తన comments service ని కొన్ని రోజులు పాటు మూసివేసింది. పెద్ద ఎత్తున జాతి విద్వేషపూరిత దాడులు social media లో ఒక విషతుల్యమైన వాతావరణాన్ని సృష్టించాయి.

The Lord of the Rings Trilogy, The Hobbit Trilogy లలో Cate Blanchett నటించిన Lady Galadriel పాత్ర కు సరిసాటిగా The Rings of Power లోని Morfydd Clark నటించిన యువ Galadriel పాత్ర లేదని విమర్శిస్తున్నారు.

ఎలాన్ మస్క్ అయితే Galadriel తప్ప The Rings of Power లోని పురుషులందరూ వెన్నెముక లేనివారు లేదా పిరికివారు అని tweet పెట్టాడు. వ్యాపారంలో జెఫ్ బెజోస్ తో ఉన్న శత్రుత్వం దానికి కారణం కావచ్చు. ప్రత్యర్థి అయిన ఆపిల్ సంస్థను కూడా అటువంటి ట్వీట్లతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం ఎలాన్ మస్క్ కి అలవాటే.
Calmness అనేది చాలా expensive thing. ఒకరు స్థితప్రజ్ఞత సాధించడం ఎన్నో ఎదురుదెబ్బలు, పొరపాట్లు, ఓటముల తరువాతే జరుగుతుంది. అపరిపక్వతలో సంభవించే చేదు ఫలితాల్ని చవిచూసాకే పరిపక్వత లభిస్తుంది. Lady Galadriel స్థితప్రజ్ఞత, దివ్యత్వం, composed and matured persona ఒక్క రోజులో రాలేదు.
Galadriel పాత్ర పట్ల ప్రేమ Tolkien కి 40 ఏళ్ల సుదీర్ఘ రచనా కాలంలో పెరుగుతూ వచ్చింది, అలాగే Tolkien యొక్క స్వీయ పరిపక్వత కూడా. అది Galadriel వ్యక్తిత్వంలో ప్రతిఫలించింది, ఎన్నో వందల సంవత్సరాలు జీవించిన ఆమె అనుభవ జ్ఞానం అది.

అలాగని యువ Galadriel కి Lady Galadriel కి నడుమ contradiction లేదా అంటే ఖచ్చితంగా ఉంది. నిజాయితీతో కూడిన adacity నుండి calmness లోకి సాగించే ప్రయాణమే Galadriel పాత్ర.
ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే జీవితంలో ప్రతి ఒక్కరికీ వారు నిర్వహించాల్సిన పాత్ర ఒకటి ఉంటుంది అని Tolkien's philosophy చెబుతుంది. ఎవరి పాత్రను వారు అత్యుత్తమంగా సర్వశక్తులను వినియోగించి నిర్వహిస్తేనే జీవన సాఫల్యం అంటుంది.

అందరూ Galadriel కాలేరు. ఎలాన్ మస్క్ కాలేరు. జీవితం కాని, కథ కాని అలా ఉండదు. ఒక ఎలాన్ మస్క్ పాత్ర ఎందరో వ్యక్తుల శ్రమతో ఏర్పడింది. ఒక శ్రామికుడు లేదా సైనికుడి కష్టం రాజు కష్టం కన్నా తక్కువ కాదు. ఎవరి పాత్రను వారు నిర్వహిస్తేనే సృష్టిలో సమతులిత అంటుంది Tolkien సాహిత్యం.
Tolkien యొక్క ప్రపంచంలో అనేక జాతుల వారు ఉమ్మడి లక్ష్యం కోసం తమ వంతు పాత్రను తాము నిర్వహిస్తారు. అదే fellowship కి అర్థం. ఇక్కడ racism కి తావే లేదు.

దర్శకుడు Peter Jackson కి మాత్రమే సాధ్యంకాగల కళాత్మక మాధుర్యంతో ఇతిహాస స్థాయిని అందుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అతను తన బాల్యం నుండి Tolkien యొక్క కాల్పనిక సాహిత్య ప్రపంచంలోకి పలాయితుడై, దానినే శ్వాసిస్తూ ఎదిగిన మహా కళాకారుడు. అయితేనేం The Rings of Power విజయవంతంగా Middle Earth ఆత్మని నిలుపుకోగలిగింది. సంగీతం, దర్శకత్వం, నిర్మాణ విలువలు Peter Jackson ఏర్పరచిన రాచబాటలో హృద్యంగా ముందుకు సాగుతున్నాయి. The Lord of the Rings Trilogy కాలానికి ఇప్పటికి పెరిగిన సాంకేతికత కూడా ఈ సిరీస్ కి ఒక వరం.

యువ Galadriel గా Morfydd Clark నటన చాలా బాగుంది. ఈ పాత్ర కోసం ఆమె పడిన కష్టాన్ని అభినందించాలి. ఆమె Tolkien సాహిత్యాన్ని, Peter Jackson చిత్రాల్ని లోతుగా అధ్యయనం చేసింది. Cate Blanchett లాంటి గొప్ప నటి చేసిన పాత్రను చేస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం, మెప్పించడం సాధారణమైన విషయం కాదు.